ఈడెన్‌టెస్టుకు అంతమందివచ్చినా ఆశ్చర్యపోను

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చేనెల 22న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగబోయే భారత్‌, బంగ్లా టెస్టు మ్యాచ్‌కు తమ దేశం నుంచి 6 వేల మంది వచ్చినా ఆశ్చర్యపోనని బంగ్లా మాజీ సారథి, జాతీయ సెలక్టర్‌ హబిబుల్‌ బషర్‌ అభిప్రాయపడ్డాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈనెల ఆరంభంలో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ అర్హత మ్యాచ్‌కు సుమారు 60 వేల మంది హాజరైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌, బంగ్లాదేశ్‌ టెస్టు మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి ఎలా ఉందని ప్రశ్నించగా హబిబుల్‌ బదులిచ్చాడు. 


'బంగ్లా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌ చూసేందుకు బంగ్లాదేశ్‌ నుంచి చాలా మంది కోల్‌కతాకు వస్తారని అనుకుంటున్నా. ముఖ్యంగా జెస్సోర్‌, ఖుల్నా ప్రాంతాలు కోల్‌కతాకు రోడ్డు మార్గంలో చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే బంగ్లా‌, కోల్‌కతాల మధ్య భావోద్వేగాలు సహజంగానే కలగలిసి ఉంటాయి. కోల్‌కతాలో నివసించే చాలా మంది మూలాలు బంగ్లాదేశ్‌లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోనూ అనేక మంది కోల్‌కతాను తమ రెండో నివాసంగా భావిస్తారు. నా స్నేహితులు అనేక మంది ఈడెన్‌ టెస్టుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. 6 వేల మంది బంగ్లాదేశీయులు వచ్చినా నేను ఆశ్చర్యపోను' అని చెప్పుకొచ్చాడు.